అపార్ట్‌మెంట్‌లో పక్కింటి వ్యక్తితో అరవింద్ ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

కానీ ఒక రాత్రి... దాదాపు పది నిమిషాలు మాట్లాడుకున్నారు.
ఒక్క మాట కూడా మాట్లాడకుండా.
మై హోమ్ అపార్ట్‌మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 101.
పక్కింట్లో, అంటే 102లో సతీష్ ఉంటాడు.
ఎప్పుడూ రాత్రే రూమ్‌కి వస్తాడు. ఎవరితోనూ మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోతాడు.
రోజుకు మూడు సార్లు స్విగ్గీ వాడు డోర్ బెల్ కొడితేనే వాడు లోపల ఉన్నాడని తెలుస్తుంది.
డోర్ ఎప్పుడూ సగం మాత్రమే తెరిచి ఆ కవర్ అందుకుని టక్కున వేసేస్తుంటాడు.
11:30 PM....
101లో అరవింద్ ల్యాప్‌టాప్ ముందు కూర్చుని ఒక అర్జెంట్ మెయిల్ పంపిస్తున్నాడు.
ఇంటర్నెట్ ఒక్కసారిగా కట్ అయింది.
రూటర్ కింద రెడ్ లైట్ బ్లింక్ అవుతోంది.
ఫోన్‌లో Wi-Fi ఓపెన్ చేశాడు.
102 ఫ్లాట్ నుంచి ఒక కొత్త నెట్‌వర్క్ ఫుల్ సిగ్నల్ తో కనిపించింది.
I_Know_You_Are_Awake
అతను కనుబొమ్మలు ముడిచాడు.
వెంటనే తన హాట్‌స్పాట్ ఆన్ చేసి, డివైజ్ పేరు మార్చాడు.
Fix_Your_Network_Idiot
రెండు నిమిషాల తర్వాత అది మారింది.
Look_Out_Of_Your_Window
అరవింద్ కి లోపల ఏదో తలకెక్కినట్టు అనిపించింది.
బెడ్‌రూమ్ కిటికీ స్క్రీన్ పక్కకి జరిపి కింద పార్కింగ్ లాట్ వైపు చూశాడు.
అక్కడ ఒక బ్లాక్ కలర్ ఇన్నోవా కారు ఆగి ఉంది.
అందులో ఇద్దరు వ్యక్తులు కూర్చుని 102 ఫ్లాట్ వైపు చూస్తున్నారు.
వాళ్లలో ఏదో అసహజమైన ప్రశాంతత ఉంది. వాళ్లు ఎవరి కోసం ఓపికగా ఎదురు చూస్తున్నట్టున్నారు.
వాళ్లలో ఒకడు తన ఫోన్ స్క్రీన్ వైపు చూస్తున్నాడు.
కొద్దిసేపటికే 102 నెట్‌వర్క్ పేరు మళ్లీ మారింది.
They_Are_Here_To_Kill_Me
అరవింద్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
ఇది ప్రాంక్ కాదు.
వాడు బయటికి రావడం లేదు. ఫోన్ కూడా వాడలేకపోతున్నట్టున్నాడు.
లేదంటే ఇలా Wi-Fi పేర్లతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది?
అరవింద్ తన హాట్‌స్పాట్ నేమ్ మార్చాడు.
Call_THE_Police
రెండు సెకన్లలో 102 నెట్‌వర్క్ పేరు మళ్లీ మారింది.
I_Am_A_Hacker_Cops_Want_Me_Too
సడన్‌గా కారిడార్ లో అడుగుల చప్పుడు.
అరవింద్ పరిగెత్తుకుంటూ వెళ్లి మెయిన్ డోర్ లెన్స్ (keyhole) లోంచి బయటకు చూశాడు.
కింద కారులో ఉన్న ఆ ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వచ్చి 102 ఫ్లాట్ డోర్ దగ్గర ఆగారు.
వాళ్ల చేతుల్లో ఏదో ఆయుధం లాంటిది ఉంది.
ఒక్కడు లాక్‌ని బలంగా లాగుతున్నాడు. అదే వ్యక్తి ఫోన్ స్క్రీన్ మీద వేళ్లతో ఏదో రిఫ్రెష్ చేశాడు.
అరవింద్ ఒళ్ళు వణికిపోయింది.
పోలీసుల కోసం వేచి చూసేంత సమయం లేదు.
చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం... ఫోన్ మాత్రమే.
అరవింద్ సతీష్ ఓపెన్ Wi-Fi కి కనెక్ట్ అయ్యాడు.
మొబైల్ బ్రౌజర్ లో రౌటర్ గేట్‌వే పేజీ ఓపెన్ చేసి, అడ్మిన్ పాస్‌వర్డ్ కొట్టాడు.
(లక్కీగా వాడు డీఫాల్ట్ పాస్‌వర్డ్ మార్చలేదు).
ఆ నెట్‌వర్క్ నేమ్ ని చాలా వేగంగా టైప్ చేసి మార్చేశాడు.
COPS_IN_FLAT_101_READY
ఆ పేరు మార్చిన కొద్ది సెకన్లకే, ఆ కారిడార్ లో ఉన్నవాడు తన ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు.
అతని మొహంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇంకొకడికి ఏదో చూపించాడు.
సరిగ్గా అదే సమయంలో కారిడార్ లో ఎక్కడో ఒక ఫ్లాట్ డోర్ గట్టిగా తెరుచుకున్న శబ్దం వినిపించింది.
ఇద్దరు వెంటనే వెనక్కి తిరిగి లిఫ్ట్ వైపు పరుగెత్తారు.
అరవింద్ డోర్ వెనుక అలాగే కూలబడిపోయాడు.
రాత్రంతా నిద్రపట్టలేదు.
మరుసటి రోజు 8:00AM..
అరవింద్ ఆఫీస్ కి వెళ్లడానికి బేస్‌మెంట్ లోకి వచ్చాడు.
అక్కడ సతీష్ తన బైక్ మీద కూర్చుని హెల్మెట్ పెట్టుకుంటున్నాడు.
బైక్ వెనుక ఒక పెద్ద ట్రావెల్ బ్యాగ్ కట్టి ఉంది.
వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు.
అరవింద్ నడుచుకుంటూ సతీష్ దగ్గరకు వెళ్లాడు.
ఇద్దరి మధ్య మూడు అడుగుల దూరం.
"ఖాళీ చేస్తున్నావా?" అరవింద్ అడిగాడు.
సతీష్ హెల్మెట్ గ్లాస్ పైకి లేపాడు.
ఎప్పుడూ ఏ ఎక్స్‌ప్రెషన్ లేని వాడి ముఖంలో ఒక చిన్న నవ్వు కనిపించింది.
కొద్దిసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.
చివరకు అరవింద్ అడిగాడు, "నిజంగానే హ్యాకర్ వా?"
సతీష్ వెంటనే ఏమీ మాట్లాడలేదు. అరవింద్ వైపు చూసి అలాగే క్షణం పాటు నిగూఢంగా నవ్వాడు.
ఆ తర్వాత హెల్మెట్ గ్లాస్ కిందకు దించుకుంటూ చాలా క్యాజువల్ గా అన్నాడు.
"లేదు బ్రదర్.. వాళ్లు లోన్ యాప్ రికవరీ వాళ్లు."
వాడు బైక్ యాక్సిలరేటర్ పెంచి, గేట్ దాటి రోడ్డు మీదకు వెళ్ళిపోయాడు.
అరవింద్ వాడు వెళ్ళిపోతున్న వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు.
వాడు నిజంగానే లోన్ యాప్ వాళ్ల భయంతో ఆ నాటకం ఆడాడా?
లేక తన అసలు ఐడెంటిటీని దాచడానికి అబద్ధం చెప్పాడా?
అరవింద్ ఫోన్ తీసి Wi-Fi ఆన్ చేశాడు.
102 అనే నెట్‌వర్క్ ఇక కనిపించలేదు.
ఒక్క రాత్రిలో...
అది కూడా సతీష్‌లాగే అదృశ్యమైపోయింది.
దూరంగా వాచ్‌మన్ రేడియోలో...
"నానాటి బతుకు నాటకము..."