తెల్లారకట్ట...7:30 AM..
మా పనిమనిషి మల్లమ్మ, తన పని అయిపోయిందనిపించుకుని వెళ్ళిపోతోంది.
వెళ్తూ వెళ్తూ డోర్ దగ్గర ఆగి... "అమ్మా... జీతం!" అంది.
'అమ్మో! ఒకటో తారీఖు వచ్చేసిందా?' అనుకుంటూ, సోఫాలోంచి నేను లేచి వెళ్లి జీతం ఇచ్చాను.
అమ్మ స్థానంలో ఈ అయ్యా వచ్చి జీతం ఇస్తుండేసరికి మల్లమ్మ ముఖం చూసి నాకు అర్థమైపోయింది. లోపల ఏదో ప్లాన్ ఉందన్నమాట! అడిగితే గట్టిగా ఇంకో వందో, రెండొందలో పెంచమని అడుగుదాం అనుకుంది. కానీ, 'అమ్మని పిలిస్తే ఈ వీడొచ్చాడేంటి? ఎప్పుడూ చూసినా మొహం అలా రుసరుసలాడుతూ పెట్టుకుని ఉంటాడు... వీడిని అడిగి ఏం లాభం, ఎందుకొచ్చింది లే...' అన్నట్టు సైలెంట్ అయిపోయింది.
కానీ వెళ్తూ వెళ్తూ ఊరుకోకుండా, "జీతం పెంచ్తవా..?" అంది
అసలు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కూడా ఇంత కాన్ఫిడెంట్ గా శాలరీ ఇంక్రిమెంట్ అడగరు! ఆఫీస్ లో వాళ్ళు ఇచ్చిందే 'మహా ప్రసాదం' అని మేమంతా తలవంచి తీసుకుంటుంటే... ఇవిడగారు అప్పుడప్పుడూ వచ్చి, ఏదో అలా అలా పని చేసి, ఇదే పనని మాతో బుకాయించి, ఇంకా జీతం పెంచమంటావా అనుకొని "చూడు మల్లమ్మ! నువ్వు రోజు కరెక్ట్ గా వస్తేనే ఎక్కువ. ఆఫీస్ లో మేమే..." అని నేను మొదలుపెట్టేసరికి, తను 'ఎందుకొచ్చింది లే వీడితో' అన్నట్టు ఒక చూపు చూసింది. డబ్బులు లెక్కెట్టుకుంటూ... 'నెక్స్ట్ మంత్ అమ్మగారు ఉన్నప్పుడు చూసుకుంటా' అనే స్టైల్ లో ఒక లుక్ వేసి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్లిన వెంటనే, "అసలు మనం ఇచ్చే జీతానికి, ఆమె చేసే పనికి, ఆ క్వాలిటీకి ఏమైనా లింక్ ఉందా రమ్యా?" అంటూ లోపలికి వచ్చాను.
రమ్య అద్దం ముందు నిల్చుని ఆఫీస్ కి రెడీ అవుతోంది. నేను రాగానే, "ఇదిగో పవన్, పొద్దున్నే స్టార్ట్ చెయ్యకు ప్లీజ్!" అంది.
"నేనేం స్టార్ట్ చేశాను రమ్యా? జస్ట్ అడుగుతున్నా..." అరే, పొద్దున్నంటే పొద్దున్నే ఏంటి అంటావ్, ఈవినింగ్ అంతె సాయంత్రం ఏంటి అంటావ్.. అసలు ఎప్పుడు మాట్లాడాలి నేను అన్నాను.
పవన్, నేను ఆఫీస్ కి వెళ్ళాలి. ఆ కాఫీ తాగి, ఆ కప్పు సింక్ లో పడేయ్. రేపు మల్లమ్మ వచ్చి కడుగుతుంది," అంది హడావిడిగా బ్యాగ్ సర్దుకుంటూ.
నేను చేతిలో ఉన్న కప్పు వైపు చూశాను. టైమ్ కరెక్ట్ గా ఉదయం 8:00 అయింది.
"అంటే... ఇప్పుడు ఉదయం ఎనిమిదింటికి తాగిన కప్పు, రేపు ఉదయం ఎనిమిదింటికి మల్లమ్మ వచ్చేదాకా సింక్ లోనే ఉంటుందా? దట్ ఈజ్ 24 అవర్స్! అంతసేపు ఆ సింక్ లో ఆ కప్పు ఏం చేస్తూ ఉంటుంది రమ్యా?" అన్నాను చాలా సీరియస్ గా.
రమ్య నా వైపు 'పొద్దున్నే వీడికేదో అయింది' అన్నట్టు చూసి, "స్నానం చేస్తుంటుంది.." అంది వెటకారంగా...
"అలా కాదు రమ్యా, జోకులు ఆపి ఇలా కూర్చో ఒక్క నిమిషం," అన్నాను.
"అబ్బా పవన్! ఆఫీస్ టైమ్ అవుతుంటే ఇప్పుడు ఈ డిస్కషన్ ఏంటి? అది కూడా ఒక ముష్టి కప్పు గురించి! ఏదో ఒకటి చేసుకో పో!" అంది విసుగ్గా.
ముష్టి కప్పా.. అది 'కష్ట కప్పు'! అంటే కష్టపడి కొన్న కప్పు!" అన్నాను నా బ్రాండెడ్ కప్పుని వెనకేసుకొస్తూ.
"అబ్బా, వదలవు కదా! ఎంటో నీ గోల, త్వరగా చెప్పు," అంటూ కాస్త విసుగ్గా వెళ్లి బీన్ బ్యాగ్ లో కూర్చుంది రమ్య.
"ఇక్కడే నువ్వు పాయింట్ మిస్ అయ్యావు రమ్యా! మన కిచెన్ కేబినెట్స్ చూడు, అసలు గిన్నెలెన్నున్నాయో! ఇప్పుడు మార్నింగ్ కాఫీకి ఒక గిన్నె వాడాం, అది సింక్‌లో పడేయమన్నావ్. ఈవెనింగ్ ఇంకోసారి కాఫీ తాగాలనుకో... అప్పుడు ఏం చేస్తావ్?" అన్నాను.
రమ్య విసుగ్గా, "పవన్... ఆఫీస్‌కి వెళ్తున్న దానిని ఆపి అడగాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆ ఇది? అక్కడేక్కడో ఇంకో గిన్నె ఉంటుంది, అందులో కాఫీ కలుపుకొని తాగడమే!" అంది చాలా క్యాజువల్ గా.
"అదే మరి! అక్కడేక్కడో అంటే... ఎక్కడ, అక్కడ? వెతకాలా? ఒక స్పెసిఫిక్ ప్లేస్ అంటూ ఉండదా? అయినా ఉన్న ముగ్గురు మనుషులకి రెండు కాఫీ కలిపే గిన్నెలెందుకు?" అన్నాను పాయింట్ లాగుతూ.
"అవునా, అలాగా... రేపు అత్తయ్యగారు వస్తారు కదా, ఆవిడని అడుగు!" అంది రమ్య బాల్ ని నా వైపు నెట్టేస్తూ.
"ఇదిగో, ఇందుకే నాకు కాలేది! కాఫీ గిన్నె గురించి అంటే మా అమ్మని అడగమంటావ్ ఏంటి?"
"ఇప్పుడేమంటావ్? ప్రతీ ఐటమ్‌కి ఒకటే గిన్నె ఉండాలంటావా?" అంది విసుగ్గా.
"అవును, దట్ మేక్స్ ఇట్ మోర్ సింపుల్ అండ్ ఈజీ టు మెయింటైన్ కదా... కాదంటావా?" అన్నాను (ఈ స్టేట్‌మెంట్ చదువుతున్నప్పుడు నేను కాలర్ ఎగరేసుకున్నట్టే ఊహించుకోండి)
"దీన్ని సింప్లిసిటీ అనరు... ము..." అని గభాల్న ఆపేసింది.
"ఎందుకాపడం? చెప్పు రమ్యా... ము... అంటే ఏంటి?" అడిగాను వదలకుండా.
"నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పో! నువ్వు కాఫీ కలుపుకొని నాకు కూడా కలిపివ్వు. ఆ గిన్నె నువ్వే కడుగుతావో, డిష్ వాషర్‌లో వేస్తావో, మళ్లీ మల్లమ్మని పిలుస్తావో నీ ఇష్టం!" అంది పరమ వెటకారంగా.
"అలా కాదు రమ్యా, నువ్వు పని అద్భుతంగా చేస్తావ్, కానీ ఫినిష్ చేయవ్!" అన్నాను.
రమ్యకి ఎక్కడో కాలి, "నీ యాంకమ్మ! వండి పెడుతుంటే శుభ్రంగా తిని... నేనేం ఫినిష్ చేయట్లేదు? ఫినిష్ కాదు... అసలు చెయ్యను.నువ్వు చేస్తావో, బయట నించి తెస్తావో నీ ఇష్టం" అంది..మళ్లీ గభాల్న 'బయట నించి వద్దులే నువ్వే చేయి, అసలే ఈ మధ్య ఫుడ్ ఇన్‌స్పెక్షన్‌లో నో క్వాలిటీ అని ఏవేవో అంటున్నారు' అంది
అది కాదు పాయింట్, టాపిక్ డైవర్ట్ చేయకు..సామాను తక్కువ ఉంటే ఇట్ విల్ బే ఈజీ టు మెయింటైన్ అని అంటున్నా. ఒప్పుకుంటావా ఒప్పుకోవా?" అన్నాను సూటిగా.
"ఒప్పుకుంటున్నా! ఇవాల్టి నుంచి నువ్వే వండేసి, గిన్నెలు కడిగేయ్... మల్లమ్మ నీకు థాంక్స్ చెప్తుంది!" అంది రమ్య కూల్‌గా
"నేను గిన్నెలు కడిగితే మళ్లీ మల్లమ్మ ఎందుకు? మానిపించేద్దాం!" అన్నాను ఆవేశంగా.
రమ్య నవ్వి, "ఇదిగో... నీకు ఏదో ఆవేశం వచ్చినప్పుడు రెండు మూడు రోజులు అన్ని సర్దేస్తావ్. ఆ తర్వాత నాకేం పట్టనట్టు అసలు పట్టించుకోవు! అయినా పొద్దున్నే ఈ డిస్కషన్ ఏంటి? నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. నీకు ఆఫీస్ లేదా ఇవాళ?" అంది లేస్తూ.
"ఉంది, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నా..." అన్నాను నెమ్మదిగా.
రమ్య ఆకాశం వైపు చూసి దండం పెట్టుకుంటూ, "నీ ఇష్టం నాయనా! ఏం చేస్తావో చెయ్యి... నన్నోదిలేయ్!" అని బ్యాగ్ సర్దుకుని కార్ కీస్ తీసుకుని మెయిన్ డోర్ వైపు నడిచింది.
డోర్ తీస్తూ తీస్తూ సడన్‌గా ఆగి, వెనక్కి తిరిగి నా వైపు ఒక లుక్ వేసింది.
ఇదంతా బానే ఉంది గాని పవన్... నువ్వు చెప్పిన ఆ 'సింప్లిసిటి' థియరీ ప్రకారం ఇవాళ ఈవెనింగ్ కాఫీ గిన్నె, ఆ కప్పు నువ్వే కడగాలి. ఒకవేళ రేపు మల్లమ్మ రాకపోతే మాత్రం సింక్ లో ఉన్న గిన్నెల బాధ్యత నీదే..అప్పుడు మాట్లాడుకుందాం నీ గిన్నెల సైకాలజీ గురించి!" అని డోర్ వేసుకుని వెళ్ళిపోయింది.
హాల్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.
నేను చేతిలో ఖాళీ కాఫీ కప్పు పట్టుకుని వంటగది సింక్ వైపు చూశాను. రమ్య అన్నట్టు కప్పు అయితే ఒంటరిగా స్నానం చేయకుండా ఇప్పుడే కడిగేయొచ్చు... కానీ రేపు నిజంగానే మల్లమ్మ రాకపోతే నా వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్తా వర్క్ ఫర్ హోమ్ అయిపోతుందేమో అని ఒక చిన్న డౌట్ కొట్టింది.
మెల్లగా వెళ్లి ఆ కప్పుని కడుగుతుంటే కిచెన్ సింక్ లో మిగతా గిన్నెలన్నీ నా వైపు చూసి "వీడెన్ని రోజులు చేస్తాడో చూద్దాం రా!" అని నా వైపు చూసి వెటకారంగా నవ్వినట్టు అనిపించింది.
కథ సుఖాంతం... ప్రస్తుతానికి!